ది ట్రయల్ మూవీ రివ్యూ : ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

మూవీ : ది ట్రయల్

రిలీజ్ డేట్ : 2023-11-24

నటీనటులు : స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, ఉదయ్ పులిమే, సాక్షి ఉత్తాడ, జస్వంత్ పెరుమాళ్ల తదితరులు

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : రామ్ గన్ని

నిర్మాతలు : స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ

సినిమాటోగ్రఫీ : శ్రీ సాయికుమార్ దారా

ఎడిటర్ : శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

మ్యూజిక్ : శరవణ వాసుదేవన్

బ్యానర్స్ : ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్

సహ నిర్మాత : సుదర్శన్ రెడ్డి

కథ :

పోలీస్ ఇన్స్‌పెక్టర్ రూప (స్పందన పల్లి), సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అజయ్ (యుగ్ రామ్) పెళ్లి జరుగుతుంది. అయితే ఇద్దరి భావాలు, అభిప్రాయాలు కలవకపోవడం వల్ల వారి మధ్య తగాదాలు, అలకలు చోటు చేసుకొంటుంటాయి. ఈ క్రమంలో రూప ప్రెగ్నెంట్ అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తాడు. ఆ క్రమంలో వివాహం జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీలో అజయ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ కేసును పోలీస్ అధికారి రాజీవ్ (వంశీ కోటు) దర్యాప్తు మొదలుపెడుతాడు.

పెళ్లైన కొత్తలో రూప, అజయ్ మధ్య విభేదాలు ఎందుకు నెలకొన్నాయి? వారిద్దరి మధ్య తగాదాలకు కారణమేమిటి? అజయ్ మరణం తర్వాత కస్టడీలోకి తీసుకొన్న రూపను రాజీవ్ ఎలా విచారించాడు? పోలీసుల కస్టడీలో అజయ్ మరణం వెనుక ఉన్న కారణాలు రాజీవ్ రాబట్టాడా? అజయ్ ఆత్మహత్య చేసుకొన్నాడా? లేదా రూప హత్య చేసిందా? అజయ్ మరణానికి అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది ట్రయల్ సినిమా కథ.

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సింపుల్‌ పాయింట్ దర్శకుడు రామ్ గన్నీ రాసుకొన్న కథ.. క్యూరియాసిటిని పెంచేలా డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే ఒక బలం కాగా, మూడు క్యారెక్టర్లతో సినిమాను నడిపించిన విధానం మరో బలంగా మారిందని చెప్పవచ్చు.కేవలం మూడు పాత్రల మధ్య జరిగే డ్రామాను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో రామ్ గన్నీ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

కథలో ఉండే సైకాలజీ డిజార్డర్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబాటు కనిపించింది. కథకు బలంగా మారిన డిజార్డర్ పాయింట్‌ను హడావిడిగా గ్రాఫిక్స్‌తో కాకుండా పాత్రలతో చెప్పించి ఉంటే కొంత ఎమోషనల్ కంటెంట్ యాడ్ అయ్యే అవకాశం ఉండేదనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు కొనసాగించిన ట్విస్టులు ఆ లోపాన్ని కప్పిపుచ్చేలా చేశాయి.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. రూప పాత్రలో స్పందన పల్లి చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. చిన్న చిన్న హావభావాలు ప్రదర్శించిన విధానం ఆకట్టుకొనేలా ఉన్నాయి. రూప పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. సినిమా భారాన్నంత రాజీవ్‌తో కలిసి రూప పంచుకొన్నది. రూప, రాజీవ్ మధ్య సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో కథ పట్టు సడలకుండా సాగింది. ఇక అజయ్ పాత్ర పరిధి మేరకు యుగ్ రామ్ రాణించారు. వంశీ, యుగ్ రామ్, రూప యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయని చెప్పవచ్చు.

ది ట్రయల్ సినిమాకు సాంకేతిక అంశాలు బలంగా మారాయి. శరవణ వాసుదేవన్ మ్యూజిక్, రీ రికార్డింగ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పూర్తిగా ఇండోర్‌ లొకేషన్లలో సీన్లను చిత్రీకరించిన తీరు శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫి బాగుంది, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో సినిమాను అందించిన తీరు నిర్మాతలు స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడకు సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజెప్పాయి.

క్రైమ్, సస్పెన్స్ జానర్‌తో సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌‌ ది ట్రయల్. దర్శకుడు రాసుకొన్న బలమైన సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. స్పందన, యుగ్ రామ్, వంశీ తమ నటనతో కథను నడిపించిన విధానం వారి ప్రతిభకు అద్దం పట్టింది. అందరూ కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా సన్నివేశాలను పండిచారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాను ఇష్టపడేవారికి ది ట్రయల్ నచ్చుతుంది. ట్విస్టులు సినిమాపై క్యూరియాసిటిని పెంచుతాయి. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ వారం చూడటానికి అవకాశం ఉన్న సినిమాల జాబితాలో ఈ మూవీని చేర్చుకోవచ్చు.

రేటింగ్ : 3/5