తెలుగు భాషపై తన అభిమానం చాటుకున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

నిర్మాత ఎస్ కేఎన్ ప్రసంగాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో అందరికీ తెలుసు. సినిమా వేడుకల్లో స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ తనదైన పంచ్ లతో ప్రసంగిస్తూ ఆకట్టుకుంటారీ ప్రొడ్యూసర్. తెలుగు భాషను అభిమానించే ఎస్ కేఎన్ మాతృభాషపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. ఇటీవల సంపూర్ణేష్ బాబు సోదరా సినిమా ఈవెంట్ లో ముంబై హీరోయిన్ ఆర్తి గుప్తాను ఉద్దేశించి ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. నెక్ట్స్ ఈవెంట్ లో అయినా కొన్ని తెలుగు మాటలు నేర్చుకుని మాట్లాడమని రిక్వెస్ట్ చేశారు.

 

ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు భాష అంటే తమకు చాలా ఇష్టమని ..ఇతర భాషల నటీనటులను తెలుగు ఇండస్ట్రీ ఆహ్వానించి ఆదరిస్తుందని, అయితే కాస్తైనా తెలుగు నేర్చుకుంటే బాగుంటుందని ఎస్ కేఎన్ చెప్పారు. ఎస్ కేఎన్ మాటలను అర్థం చేసుకున్న హీరోయిన్ ఆర్తి గుప్తా తెలుగు మాటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. తెలుగు నేర్చుకుంటూ, ఆ ఫొటోనూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. తెలుగు నేర్చుకునేందుకు హీరోయిన్ ఆర్తి గుప్తాను ఇన్స్ పైర్ చేసిన నిర్మాత ఎస్ కేఎన్ ను నెటిజన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు.