– సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘ఎస్ఎస్ఎంబి 28’ నుంచి ‘మాస్ స్ట్రైక్’ విడుదల
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. వెండితెరపై వింటేజ్ మహేష్ బాబుని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ‘ఎస్ఎస్ఎంబి 28’ టైటిల్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా చిత్ర బృందం టైటిల్ వెల్లడికి ముహూర్తం ఖరారు చేసింది. లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న టైటిల్ ని రివీల్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక్కడ మరో విశేషం ఉంది. కృష్ణ గారు నటించిన ఆల్ టైం హిట్స్ లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4K లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్ఎస్ఎంబి 28’ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో కూడిన గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు. పైగా ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతుల మీదుగా జరగనుంది. అభిమానుల చేతుల మీదుగా ‘మాస్ స్ట్రైక్’ పేరుతో విడుదలవుతున్న ఈ గ్లింప్స్ అభిమానులకి మాస్ ఫీస్ట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక తండ్రి జయంతి సందర్భంగా ఆయన సినిమా మళ్లీ విడుదల కావడం, ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కొడుకు సినిమా గ్లింప్స్ విడుదల చేయడం అనేది సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘటనకు ‘ఎస్ఎస్ఎంబి 28’ శ్రీకారం చుట్టింది.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28’ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్