సినిమా పేరు : సలార్
విడుదల తేదీ : డిసెంబర్ 22, 2023
నటీనటులు : ప్రభాస్, శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ తదితరులు
దర్శకుడు : ప్రశాంత్ నీల్
నిర్మాత : విజయ్ కిర్గంధూర్
సంగీతం : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : భువన్ గౌడ్
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నుంచి వచ్చిన కొత్త ప్రాజెక్ట్ “సలార్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ :
ఖాన్సార్ నగరానికి నాయకుడిగా రాజమన్నార్ (జగపతి బాబు) తిరుగులేని విధంగా ఉంటాడు. ఐతే, రాజమన్నార్ రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరని చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ నిర్ణయం ఖాన్సార్ నగరం గమనాన్నే మార్చేస్తోంది. ఖాన్సార్ నగరానికి నాయకుడు అవ్వడం కోసం చుట్టూ ఉన్నవారంతా బలాన్ని పోగేసుకుని యుద్దానికి సన్నద్ధం అవుతుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వరద రాజమన్నార్ పై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. అందరూ వరద రాజమన్నార్ ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు వరద. ఆ తర్వాత దేవా(ప్రభాస్) ఏం చేశాడు ?, తన స్నేహితుడి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు ?, ఈ క్రమంలో శత్రువులు ఎలా భయపడ్డారు ?, అసలు దేవా ఎవరు ?, అతని గతం ఏమిటి ?, అతని తండ్రి ఎవరు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
భారీ అంచనాలతో వచ్చిన సలార్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే, హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తోనూ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. అదేవిధంగా ఖాన్సార్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. సలార్ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ బాగా పలికించాడు. ప్రభాస్ – శ్రుతి హాసన్ మధ్య సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి. తన పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో జగపతి బాబు కూడా చాలా బాగా నటించాడు. శ్రియా రెడ్డి తన పాత్రలో మెరిశారు. ఆమె పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
నటి ఈశ్వరీ రావుకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె అమ్మగా అలరించింది కూడా. బాబీ సింహా, మధు గురుస్వామి, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా సెటిల్డ్ గా నటించారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రధాన పాత్రల పై ప్రశాంత్ నీల్ పెట్టిన ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అన్నట్టు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సలార్ కథలోని మెయిన్ సెటప్ లో డెప్త్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక కష్ట కాలంలో ఉన్న స్నేహితుడి కోసం హీరో రంగంలోకి దిగి ఏం చేశాడు ?, స్నేహం కోసం ఎలాంటి త్యాగం చేశాడు ? అనేదే ఈ సినిమా థీమ్. కానీ, ఆ స్నేహాన్ని పాత్రలు పెద్దయ్యాక కూడా మరింత ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అన్నట్టు ‘కె.జి.ఎఫ్’ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాల మాదిరి ఇందులో కూడా లెక్కకు మించి పాత్రలు ఉన్నాయి.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత విజయ్ కిర్గంధూర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
తీర్పు :
హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘సలార్’ చాలా బాగా ఆకట్టుకుంది. ప్లే ఇంట్రెస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటుగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ, మరియు మెయిన్ కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐతే ఫుల్ కిక్ ను ఇస్తోంది ఈ సినిమా. కాకపోతే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ, ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను చాలా బాగా అలరిస్తోంది
రేటింగ్ : 3.5/5