సామాజిక సేవలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విజయవాడలోని ‘అమ్మ అనాథాశ్రమం’కి తనవంతు విరాళం అందజేశారు

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడు ముందుంటారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తనవంతు సహాయం అందించేందుకు 20 లక్షల రూపాయలను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. తాజాగా విజయవాడలో పర్యటించి ‘అమ్మ అనాథాశ్రమం’కి తన సహాయం అందజేశారు.

విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన తేజ్, అనంతరం ‘అమ్మ అనాథాశ్రమం’లో ఆశ్రమవాసులతో మాట్లాడి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సమయంలో అనాథాశ్రమానికి 2 లక్షలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

2019లో తన పుట్టిన రోజు సందర్భంగా ‘అమ్మ అనాథాశ్రమం’కి భవనం కట్టిస్తానని హామీ ఇచ్చిన సాయి తేజ్, 2021లో దానిని పూర్తి చేసి అప్పగించారు. ముగ్గురు సంవత్సరాల పాటు ఆశ్రమాన్ని దత్తత తీసుకుని అన్ని ఖర్చులనూ భరించారు. సాయి తేజ్ చేసిన ఈ మంచి పనికి ఆశ్రమంలోని పిల్లలు మాత్రమే కాకుండా ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సేవా గుణం పొందిన సాయి తేజ్, భవిష్యత్తులోనూ వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తన వంతుగా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.