సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న
సినిమా “రాజయోగం” . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి
నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక
వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్బంగా హీరో సాయి రోనక్ చిత్ర విశేషాలు తెలిపారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ…రాజయోగం ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్. రెండు గంటలు నవ్వుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో నేనొక డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నాను. క్లాస్ సొసైటీలో కలిసేలా ఉంటానని నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటారు. మా ఓనర్ స్థానంలో నేను ఒక అమ్మాయిని కలిసేందుకు పెద్ద హోటల్ కు వెళ్తాను. నేను కోటీశ్వరుడిని అని ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి డబ్బుందని నేను..ఇలా ఇద్దరం ఒకరి మీద మరొకరం బాగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఈ డ్రామా చివరకు ఎలా ముగిసింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పదివేల కోట్ల రూపాయల డైమండ్స్ పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈవీవీ గారి స్టైల్ సినిమాల్లో ఉన్నట్లు ఒక ఛేజింగ్ తో సినిమా సాగుతుంది. ఫైట్స్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇది రొమాంటిక్ ఫిల్మ్ అనేది బాగా బయటకొచ్చింది. అన్ని అంశాలుంటాయి.
ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు భయపడ్డాను. కొన్ని సార్లు దర్శకుడితో గొడపవడ్డాను. మొత్తం ఎడిటింగ్ లో చూశాక దర్శకుడి విజన్ అర్థమైంది. ఆయన చూపించిన సీన్స్ ఏవీ ఇబ్బంది పెట్టేలా ఉండవు. నాకు డాన్స్, ఫైట్స్ బాగా వచ్చు. ఇండస్ట్రీలో కొంతమంది స్టార్స్ కు డాన్సు నేర్పంచాను. ఆ స్కిల్ చూపించే అవకాశం ఈ చిత్రంలో కలిగింది. నాకు సహజంగా సాగే రియలిస్టిక్ మూవీస్ కంటే కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి ఫాంటసీ చిత్రాలు ఇష్టం. రాజయోగం మాత్రం పూర్తి కమర్షియల్ గా సాగుతుంది. ఇలాంటి మూవీస్ కు లాజిక్స్ అవసరం లేదు. క్రియేటివ్ గా ఎంత బాగుంది అనేది చూడాలి. మీరు సినిమా చూడండి తప్పకుండా నచ్చుతుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరూ గాడ్ ఫాదర్ లేరు. డాన్స్ లు నేర్పించడం వల్ల కొందరు ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత రొమాంటిక్ ముద్ర నాపై పడుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలు దేనికది భిన్నమైనది. నీలకంఠ దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమాతో పాటు అవికా గోర్ తో పాప్ కార్న్ అనే మూవీ, ఉషాకిరణ్ సంస్థలో ఓ చిత్రంలో నటిస్తున్న. ఇవన్నీ నాకు వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరు తెస్తాయని ఆశిస్తున్నా. అన్నారు.