ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా “వ్యూహం”. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ఈవెంట్ విజయవాడలో చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గురించిన నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తుండటం సంతోషకరం. ఇలాంటి గొప్ప సినిమాను అడ్డుకోవాలని కొందరు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాలు మాని వ్యూహం సినిమా మీద పడుతున్నారు. వ్యూహం సినిమాకు వైసీపీ నుంచి అందరి సపోర్ట్ ఉంటుంది. ప్రజలంతా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ సంచలనమే. ఆయన శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ శివ ముందు శివ తర్వాత అనేంత మారిపోయింది. వ్యూహం లాంటి సినిమాలు వర్మ గారు మరిన్ని తీయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ – నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ఆర్జీవీ..ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమపై తమదైన ముద్ర వేశారు. వైఎస్ గారి మరణం నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి కుట్ర రాజకీయాలు సాగుతున్నాయి అనేది మనం పేపర్స్ లో చదువుతుంటాం, మాట్లాడుకుంటుంటాం. అలాంటి అంశాలను ఉన్నది ఉన్నట్లుగా సినిమాగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయం. కుట్ర రాజకీయాల గురించి ప్రజలకు వ్యూహం ద్వారా తెలియాలి. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకునేందుకు కొందరు కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహం రిలీజ్ ను ఆపలేరు. ఈ సినిమాతో ప్రజలకు నిజాలు తెలియాలి. అన్నారు
ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే కొందరు భయపడి కోర్టులకు వెళ్తున్నారంటేనే ఈ సినిమా ఎంతటి విజయం సాధించబోతోంది అనేది అర్థం చేసుకోవచ్చు. శివ సినిమాతో మా ఫేవరేట్ డైరెక్టర్ అయ్యారు ఆర్జీవీ. వ్యూహంతో గొప్ప సినిమా చేశారు. అందరూ చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.
వైసీపీ సమన్వయకర్త ఫాతిమా మాట్లాడుతూ – దర్శకత్వంలో ఆర్జీవీ ముందు ఆర్జీవీ తర్వాత అని చెప్పుకున్నట్లు రాజకీయాల్లో జగన్ గారి ముందు జగన్ గారి తర్వాత అని చెప్పుకుంటాం. ఈ సినిమాలోని నిజాలను చూసి కొందరికి భయ పుడుతోంది. అందుకే కోర్టులకు వెళ్తున్నారు. ఈ సినిమాలో జగన్ గారిని చూపించిన విధానం బాగుంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
తెలుగు సేన అధ్యక్షుడు సత్యా రెడ్డి మాట్లాడుతూ – వర్మ గారు ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చేశారు. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఆయన ముద్ర వేసుకున్నారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున ఇక్కడ జరగడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్ గారి అభిమానులకు సంతోషాన్ని పంచుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన మాట్లాడుతూ – వ్యూహం సినిమాకు పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. వర్మ గారితో కలిసి వర్క్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాతో అలాంటి అవకాశం దక్కింది. వ్యూహం సినిమాకు మ్యూజికల్ ది బెస్ట్ వర్క్ చేశాను. అని చెప్పింది.
ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – రాజకీయాల్లో భయం లేని నాయకుడు జగన్ గారు. అలాగే సినిమా ఇండస్ట్రీ భయం లేని దర్శకుడు ఆర్జీవీ. వ్యూహం ట్రైలర్ రిలీజ్ కాగానే చంద్రబాబు, లోకేష్, పవన్ భయపడ్డారు. తమ గురించి నిజాలు తెలుస్తాయని వాళ్ల భయం. వర్మను భయపెట్టాలని చూశారు. ఆయన ముంబై మాఫియాకే భయపడలేదు వీళ్లకు భయపడతాడా. వ్యూహం సినిమా పెద్ద హిట్ కావాలి. అన్నారు.
మంత్రి రోజా మాట్లాడుతూ – ఆర్జీవీ అంటేనే ఒక సెన్సేషన్. వ్యూహం సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే, సైకిల్ పార్టీ షేకయిపోయింది. వర్మ గారు డైరెక్టర్ అని తెలియగానే పచ్చ సైకోలకు తడిసిపోయింది. ఎప్పుడైతో వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబుకు చెమటలు పట్టాయి. ట్రైలర్ తో లోకేష్ పరుగులు పెట్టాడు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు, జగన్ అన్న పడిన సంఘర్షణకు రూపమే వ్యూహం సినిమా అని తెలుస్తుంది. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లా.. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు వ్యూహం సినిమాతో ఈ తరంతో పాటు వచ్చే తరానికీ తెలుస్తాయి. అని చెప్పారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ – జగన్ గారి రాజకీయ ప్రస్థానం విషాధంతో మొదలై విజయంతో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన పడిన సంఘర్షణను దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమాగా రూపొందించారు. ఆర్జీవీ తన సినిమాలను నిజాయితీగా నిర్భయంగా రూపొందిస్తాడు. శ్యామ్ బాబు పేరుతో నా క్యారెక్టర్ ను పవన్ సినిమాలో పెట్టారు. కానీ వర్మ అలా భయపడడు. రాంబాబును రాంబాబులాగే చూపిస్తాడు. చంద్రబాబును చంద్రబాబులాగే చూపిస్తాడు. వ్యూహం సినిమాలోనూ అదే ప్రయత్నం చేశారు. వర్మ సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న దర్శకుడు. జగన్ గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయనను ఓడించాలని చూసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు. అన్నారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ – ఎన్నో కుట్రలు, చెడు వ్యూహాలను తన శక్తితో , యుక్తితో ఎదుర్కొన్ని విజేతగా నిలబడ్డ నాయకుడు జగన్. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందిరికీ అభిమాన నాయకుడు అయ్యారు. జగన్ అంటే మంచితనం, మనసున్న వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి మనసున్న మంచి వ్యక్తి జీవితాన్ని వ్యూహం సినిమా ద్వారా చూపించాలని ఆర్జీవీ గారు ప్రయత్నం చేయడం అభినందనీయం. వ్యూహం సినిమా రిలీజ్ కాకముందే చంద్రబాబు, లోకేష్ లో భయం పుట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ ను ఎవరూ ఆపలేరు. ప్రజలు వ్యూహంను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు
ఎమ్మెల్యే శివ కుమార్ మాట్లాడుతూ – సీఎం జగన్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే ఎన్నో కుట్రలు కొందరు చేశారు. ఆ కుట్రల వెనక దాగి ఉన్న నిజాలను వ్యూహం సినిమాతో దర్శకుడు వర్మ గారు చూపించే ప్రయత్నం చేయడం సంతోషంగా ఉంది. జగన్ గారి అభిమానిగా మీతో పాటు నేను కూడా ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నా. అన్నారు.
క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ – మన అభిమాన నాయకుడు జగన్ గారి జీవితం ఆధారంగా వ్యూహం సినిమాను రూపొందించిన దర్శకుడు వర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉంటుందని ఆశిస్తున్నా. మనమంతా జగన్ గారికి 2024లో మరోసారి సీఎం చేసేందుకు కలిసి రావాలని కోరుతున్నా. వ్యూహంతో జగన్ గారి మీద చేసిన దుష్ప్రచారాల వెనక దాగి ఉన్న నిజాలు తెలుస్తాయి. అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశాను. కానీ వ్యూహం సినిమా నేపథ్యం ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదే. ఇందులో కథ కంటే క్యారెక్టర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు బయటకు ఎలా కనిపిస్తారు, వెనక ఎలాంటి కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు పన్నుతారు అనేది నేను సైకలాజికల్ కోణంలో ఈ సినిమాలో తెరకెక్కించాను. నేను రాజకీయాల్లో లేకున్నా, రాజకీయ నాయకుల సైకాలజీని అర్థం చేసుకుంటాను. కాంటెంపరరీ ఇష్యూస్ ఉన్న వ్యూహం లాంటి మూవీ వరల్డ్ సినిమాలో రాలేదని చెప్పగలను. నారా లోకేష్ వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లి అందులో అతను చెప్పిన కారణం మమ్మల్ని కించపరుస్తున్నారని చెప్పాడు. కానీ రోజు లేచిన దగ్గర నుంచి లోకేష్ చేస్తున్న పని జగన్ ను కించపరచడం. అనేక మాటలు, ఆరోపణలు, విమర్శలు చేయడం. ఇలాంటి లోకేష్ తనను కించపరుస్తున్నారని వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లడం ఏంటి. ఎన్టీఆర్ ను చెడ్డవాడిగా చిత్రీకరించిన చంద్రబాబు మళ్లీ ఎక్కడ ఆయన అభిమానుల ఓట్లు పోతాయో అని చెప్పి ఎన్టీఆర్ ను మహానుభావుడు అనడం మొదలుపెట్టాడు. పవన్ జనసేన పెట్టినప్పుడు ఇంప్రెస్ అయ్యా. కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు చూసి పవన్ మీద అభిమానం పోయింది. తెలంగాణలో బర్రెలక్క అనే ఒక అమ్మాయి ధైర్యంగా రాజకీయాల్లో నిలబడింది. అలాంటి ధైర్యం కూడా పవన్ కు లేదు. కొందరి చేతిలో కీలుబొమ్మగా మారాడు. నేను వైసీపీ మనిషిని అంటున్నారు. నేనే చెబుతున్నా కదా జగన్ కు ఫేవర్ గానే వ్యూహం సినిమా ఉంటుంది. డెఫనెట్ గా ఈ నెల 29న వ్యూహం సినిమా రిలీజ్ చేస్తాం. అన్నారు.
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంతో వ్యూహం సినిమా ఉంటుంది. ఇందులో యదార్థ ఘటనల స్పూర్తిగా ఫిక్షనల్ కథను చూస్తారు. మన పేపర్స్, టీవీ, యూట్యూబ్ లో చూసిన విషయాలేవీ వ్యూహంలో ఉండవు. ఆ ఘటనల వెనక దాగి ఉన్న కుట్రలు, కుతంత్రాలు, నిజాలతో వర్మ గారు వ్యూహం సినిమాను రూపొందించారు. తండ్రి చనిపోయినప్పుడు జగన్ గారు ఆ బాధలో ఉండగానే…కేంద్ర పాలకులతో కుమ్మక్కై కొందరు ఆయన జీవితంపై కుట్రలు చేశారు. జైలుకు పంపారు. జగన్ గారు తన కుటుంబాన్ని భార్యా పిల్లల్ని వదిలి జైలు జీవితం గడిపారు. జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్రతో ప్రజల ప్రేమాభిమానాలు గెల్చుకున్నారు. ఇక్కడే ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ గారు జీవితాంతం సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రమాణ స్వీకారం రోజు ప్రజలకు ఇచ్చిన మానిఫెస్టోను 99శాతం అమలు చేసిన ఘనత మన సీఎం గారిది. వ్యూహం సినిమాను ఎంతో స్పష్టతతో, అవగాహనతో, అధ్యయనం చేసి వర్మ గారు రూపొందించారు. వర్మ గారితో నేను వంగవీటి అనే సూపర్ హిట్ సినిమా చేశాను. ఇప్పుడు వ్యూహం సినిమాను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమాను ప్రజలకు చేర్చితే అదే ఘన విజయం అని భావిస్తా. వర్మ గారు వ్యూహం సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తప్పకుండా వ్యూహం సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు