నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకా, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
సాంకేతికత: మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన “ఫియర్” (Fear) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డా. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డా. వంకి పెంచలయ్య మరియు ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే, “ఫియర్” ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక, ఈ సినిమా యొక్క కథ, నటన, మరియు అద్భుతమైన సస్పెన్స్ ఎలిమెంట్స్ గురించి సమీక్షలో తెలుసుకుందాం.
కథ: సింధు, ఇందు (వేదిక).. కవల పిల్లలు. చిన్న తనం నుండి కలిసి మెలిసి పెరిగిన వీరి మానసిక స్థితి విరుద్ధంగా ఉంటుంది. వారిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన సంపత్ (అరవింద్ కృష్ణ) అంటే సింధు కి చాలా ఇష్టం. అతను తనకు తప్పా ఎవరికీ దక్కొద్దు అనుకుంటుంది. ఆఖరికి ఆమె అక్కకి కూడా.. అంతేకాదు ఆమెలో భయం ఎక్కువ. కథ చెప్పిన బూచోడు నిజంగా తన ను వెంటాడుతుంటాడు అనుకుంటుంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అక్కడ డాక్టర్ తో తనకు సంపత్ కావాలని చెప్తుంది. క్యాంపు పనిమీద ఊరికి వెళ్ళిన సంపత్ ఎప్పుడొస్తాడో తెలీదు. అసలు సింధు కి ఏమైంది. ఆమెకున్న మానసిక వ్యాధి ఏంటి? అసలు సాయాజి షిండే, సత్య కృష్ణ ఎవరు? వారికి సింధుకి సంబంధం ఏంటి? అంతలా భయపడడానికి అసలు కారణం ఏమిటి? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన “ఫియర్” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. ఈ చిత్రంలో వేదిక రెండు విభిన్న పాత్రల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మాయ చేసింది. ఆమె సింధు మరియు ఇందు పాత్రలకు జీవం పోసింది, ప్రతి ఎమోషన్‌ను చక్కగా వ్యక్తం చేసింది. వేదిక ఎంపిక కథకు పర్ఫెక్ట్ అనిపించాయి. ఆమె నటన చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని మరింత బలంగా మార్చింది.
అరవింద్ కృష్ణ పాత్ర చిన్నదైనా, అతని ప్రదర్శన చాలా ప్రభావవంతంగా నిలిచింది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి వంటి నటీనటులు అన్ని పాత్రలను నిజమైన భావం చేకూర్చి, సినిమా కథను సజీవంగా మలచారు. ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటం, కథలో వాళ్ల పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం.
సంగీతం ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలకు సంగీతం సహజంగా సరిపోవడం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు విశేషంగా సహకరించింది. కెమెరా పని సినిమాకు అదనపు రిచ్ ఫీలింగ్‌ను ఇచ్చింది. విజువల్స్ కథకు తగ్గట్టు ఉంటాయి, ఇది సినిమాలో కొత్తగా అనిపిస్తుంది.
డా. హరిత గోగినేని దర్శకత్వంలో, సినిమాలో ఎడిటింగ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆమె రచించిన కథ, స్క్రిప్ట్‌లో లోతు ఉంది, దీని వల్ల కథ మరింత ఆసక్తిగా మారింది. దానికి తోడు, ఎడిటింగ్ వల్ల చిత్రంలోని సస్పెన్స్ మరింత పెరిగింది. “ఫియర్” సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్ గా మారినప్పటికీ, హరిత గోగినేని కుటుంబం మరియు ప్రతి వయస్సు వారికి కూడా అనువుగా ప్రేక్షకించడానికి ప్రయత్నించారు.
సినిమాకు ప్రొడక్షన్ విలువలు కూడా బాగున్నాయి. ప్రతీ సన్నివేశం చాలా శ్రద్ధతో తీర్చిదిద్దబడింది. “ఫియర్” చిత్రంలో పాత్రలు, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్—ప్రతి అంశం సమన్వయంగా కలిసి ఈ చిత్రం మరింత అద్భుతగా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథలో వేదిక తన నటనతో నటన ప్రావీణ్యాన్ని చాటింది.
Rating:3/5