వైవిధ్యమైన సినిమాలతో తమిళ్ లో తనదైన శైలిలో రాణిస్తోన్న హీరో విజయ్ ఆంటోనీ. గతంలో నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు మూవీతో తెలుగులోనూ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీ అతనికి తిరుగులేని మార్కెట్ ను ఇచ్చింది. ప్రస్తుతం బిచ్చగాడుకు సీక్వెల్ గా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వర్తిస్తున్నాడు. బిచ్చగాడు2 అనే టైటిల్ తో పాటు బికిలి అనే టైటిల్ కూడా పెట్టాడు విజయ్ ఆంటోనీ. అయితే ఈ బికిలి అనే పదానికి అర్థం ఏంటీ అంటూ కొన్నాళ్లుగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కన్ఫ్యూజన్ ను క్లియర్ చేస్తూ.. బికిలీ అనే పదానికి అర్థం చెబుతూ.. లేటెస్ట్ ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
పాటలో మొదట బికిలీ అంటే ఏంటీ అనేదానికి వివరణ ఇస్తూ ‘‘నమస్కారం.. నేను విజయ్ ఆంటోనీని మాట్లాడుతున్నాను. నేను బాగా ఆలోచించి ఆలోచించి.. ఏదో నా వల్ల అయిన ఒక కొత్త చెడ్డ పదాన్ని కనిపెట్టాను. చెడ్డపదం అంటే మీరనుకుంటున్నట్టు.. మాట్లాడ్డానికి అసహ్యంగా ఉండే పదం కాదు. వినేవాళ్లకు అది అసహ్యంగా ఉండే పదం. నేను కనిపెట్టిన ఆ కొత్త పదం పేరు బికిలీ. పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన దగ్గరున్న ధనబలంతో వాళ్ల పొట్టను కొట్టి వాళ్లను బానిసలుగా మార్చి డబ్బుందన్న అహంకారంతో తిరిగేవాడే బికిలీ. మనలో చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా ముందుకెళ్లలేక తలపట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం.. ఈ బికిలీలే. వాళ్లను మనం ఏం చేయలేకపోయినా.. బికిలీ అనే పదంతో పిలవొచ్చు. ఈ రోజు నుంచి నేను కనిపెట్టిన ఈ బికిలీ పదం.. భారతదేశంలో వాడకంలోకి వస్తుంది..’’ అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలతో మొదలైన వీడియో సాంగ్.. ‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి…’ అంటూ మొదలై.. మూవీ థీమ్ ను తెలియజేస్తూ.. కొందరికి హీరో ఎందుకు బికిలీ అనే పేరు పెట్టాడు అనే వివరణ ఇచ్చే సాహిత్యంతో మాంటేజ్ సాంగ్ గా సాగుతోంది. ‘లేనివాళ్లను తొక్కిపెట్టి నమ్మి వస్తే ముంచివేసి చెవిలోనా పెట్టెరా పువ్వులు, పక్కనుండి గొయ్యి తీసి నిద్రపుచ్చి గొంతు కోసి ఏడిపించే నవ్వేరా నవ్వులు.. పేరు గొప్ప ఊరు దిబ్బ’ అంటూ అర్థవంతమైన సాహిత్యంతో సాగే ఈ గీతాన్ని కంపోజ్ చేసి, పాడటమే కాదు.. రాసింది కూడా విజయ్ ఆంటోనీయే కావడం విశేషం.
బిచ్చగాడు విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో రెండో భాగంపైనా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికైతే గతంలో విడుదలైన థీమ్ సాంగ్ తో పాటు ఈ బికిలీ పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది బిచ్చగాడు2 మూవీ.
ఈ వేసవి బరిలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో
దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోనీ, పిఆర్వో- జిఎస్కే మీడియా, బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ.