విజయవాడ 35వ పుస్తక ప్రదర్శనలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత సమగ్ర సాహిత్యం

విజయవాడ 35వ పుస్తక ప్రదర్శనలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత సమగ్ర సాహిత్యం అందుబాటులో ఉంచామని తెలిపారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ నాయకులు టి.డి జనార్థన్. పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంలో ప్రజలతో మమేకమైన ఎన్నో సందర్భాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు అద్దం పట్టేలా పుస్తకాన్ని ప్రచురించినట్లు టి.డి జనార్థన్ తెలిపారు.

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ నాయకులు టి.డి జనార్థన్ మాట్లాడుతూ – మన జీవితంతో పుస్తకాలు ఎన్నో ఏళ్లుగా మమేకమై పోయాయి. కాగతం కనుగొనకముందు తాళపత్ర గ్రంథాల్లో గొప్ప సాహిత్యం రాశారు. ప్రపంచంలో అనేక విప్లవాలకు అక్కడి సాహిత్యం స్ఫూర్తిగా నిలిచింది. డిజిటల్ యుగం వచ్చాక పుస్తకాలను ఆధునిక పద్ధతుల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 35వ బుక్ ఫెస్టివల్ లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత సమగ్ర సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. మేము అడగగానే బుక్ ఫెస్టివల్ వారు స్టాల్ కేటాయించారు. ఎన్టీఆర్ సినీరంగంలో ఉన్నప్పుడు వివిధ మాధ్యమాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను ఒక పుస్తకంగా, 35వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను కలుసుకుని వారితో ప్రసంగించిన ఉపన్యాసాలను ఒక పుస్తకంగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలను అసెంబ్లీ ప్రసంగాలు అనే పుస్తకంగా, అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసింది ఎన్టీఆర్. ఆ పథకాలన్నీ ఒక పుస్తకంగా తీసుకొచ్చాం. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతను చూపించేలా ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించాం. ఈ పుస్తకాలన్నీ మన స్టాల్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అన్నారు.