‘ARM’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ సినిమా. విజువల్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండనుంది: హీరో టోవినో థామస్

స్టార్ హీరో టోవినో థామస్ తన 50వ సినిమా, పాన్ ఇండియా ఫాంటసీ ప్రాజెక్ట్ “ARM” తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డెబ్యూ దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ARM సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

50వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విశేషాలు పంచుకుంటూ టోవినో థామస్ మాట్లాడుతూ, “చిన్న పాత్రలతో నా కెరీర్ మొదలైంది. 2016 నుంచి లీడ్ రోల్స్ చేస్తున్నాను. ARM ప్రారంభమైనప్పుడు ఇది నా 50వ సినిమా అవుతుందని తెలియదు. ఈ చిత్రం చాలా ఆసక్తికరమైన కథతో వస్తుంది. ఇందులో మూడు విభిన్న పాత్రలు చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. మణి అనే దొంగ పాత్ర నా ఫేవరెట్, అది పాషనేట్ క్యారెక్టర్, ఆ పాత్రను ప్రేక్షకులు ఇష్టపడతారు” అని అన్నారు.

“కళరి ఫైట్ కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నాను, అయితే పూర్తిగా నేర్చుకోవడం సాధ్యం కాదు, కానీ కొంత అవగాహన పొందాను. జితిన్ లాల్‌తో నాకు ఎనిమిదేళ్ల జర్నీ ఉంది, అతని కథనం అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఫైట్స్, క్యారెక్టర్ స్విచ్‌లు వంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. మేకప్ కోసం చాలా సమయం పట్టేది. డైరెక్టర్ ప్రతి అంశాన్ని శ్రద్ధగా తెరకెక్కించారు” అని వివరించారు.

కృతి శెట్టి పాత్ర గురించి మాట్లాడుతూ, “మూడు ప్రేమకథలు ట్రైలర్‌లో చూపించాం. ఈ ప్రేమకథల్లో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి అద్భుతంగా నటించారు” అని అన్నారు.

“ఈ సినిమాని త్రీడీలో విడుదల చేయడం కథలో ఇమాజినరీ ఫిక్షనల్ వరల్డ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఈ సినిమా యూనివర్సల్ కనెక్ట్ అయ్యేలా దాదాపు 30 భాషల్లో సబ్‌టైటిల్స్ తో రాబోతోంది” అని వివరించారు.

ARM టైటిల్ గురించి మాట్లాడుతూ, “అజయన్ రెండో దొంగతనం అని దీని అర్థం. మిగతా భాషల వారికి సులభంగా పలకడానికే ARM అని వ్యవహరిస్తున్నాం” అని అన్నారు.

“మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తెలుగు లో ఈ సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందకరం” అని టోవినో థామస్ తేలిపారు