ఆహాలో “అన్‌స్టాపబుల్” షో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? బాలయ్య బాబు ఎనర్జీ, ఆయన అడిగే ప్రశ్నలు, అతిథులతో ఆయన పంచుకునే సరదా కబుర్లు అన్నిటికీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు నాలుగో సీజన్ మొదలైంది, మొదటి ఎపిసోడ్‌కే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారు. అవును, మన సీఎం గారే.. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ, చంద్రబాబును అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి, ఆయన రాజకీయ జీవితంలోని వివిధ అంశాలను చర్చించారు.
ముఖ్యంగా, చంద్రబాబు జైలు జీవితం గురించి బాలకృష్ణ వివరంగా తెలుసుకోవాలనుకున్నారు. “జైలు జీవితం మీలో ఎలాంటి మార్పులు తెచ్చింది?”, “రాజకీయ ప్రత్యర్థులకు ఎలా మాధానమివ్వబోతున్నారు?” వంటి ప్రశ్నలతో చంద్రబాబును బాలకృష్ణ ఇరుకున పెట్టారు. “జైలులో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి?” అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అడిగిన బాలకృష్ణ ప్రశ్నలు రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రోమోలను చూస్తుంటే, చంద్రబాబు బాలకృష్ణ ప్రశ్నలకు ఎంతో సమయస్ఫూర్తితో సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది. “జైలులో గడిపిన 53 రోజులు ఎలా ఉన్నాయి?”, “ఆ సమయంలో మీరు చూసిన ప్రపంచం ఎలా ఉంది?” వంటి ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. జైలులో ఉన్నప్పుడు ఆయన చదివిన పుస్తకాలు, చూసిన టీవీ కార్యక్రమాలు, అలవర్చుకున్న అలవాట్ల గురించి కూడా చర్చించారు. పంచాయితీ రాజ్ విధానం, ప్రభుత్వ విధానాలపై ఆయన దృష్టి మరింత కేంద్రీకృతమైందని చంద్రబాబు తెలిపారు.
టీడీపీ-జనసేన మధ్య పొత్తు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారనే విషయంపై కూడా బాలకృష్ణ చర్చించారు. “మీ భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలకు మీరు ఎలాంటి మార్కులు ఇస్తారు?” అనే ప్రశ్న కూడా అడిగారు. “అమరావతి అందరికీ రాజధానిగా ఉంటుందా? లేదా సంపన్నులకు మాత్రమేనా?” అంటూ ప్రజల్లో ఉన్న అనుమానాలను ప్రతిబింబించే ప్రశ్నను కూడా బాలకృష్ణ ముందుకు తెచ్చారు. ఈ విధమైన కఠిన ప్రశ్నలకు చంద్రబాబు ఎలా సమాధానమిచ్చారో తెలుసుకోవాలంటే “అన్‌స్టాపబుల్” ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.