భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంపికయ్యారు

నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఈ గౌరవం, బాధ్యత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ హోంశాఖకు రశ్మిక మందన్న కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా

రశ్మిక మందన్న స్పందిస్తూ – కొన్ని నెలల క్రితం నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. అదొక సైబర్ క్రైమ్. ఆ ఘటన జరిగినప్పటి నుంచి సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని, ఈ నేరాలపై పోరాడాలని నిర్ణయించుకున్నా. నా ప్రయత్నానికి అండగా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నిలిచింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా నాకు బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నా. సైబర్ నేరగాళ్లు అనేక పద్ధతుల్లో మనల్ని మోసగించాలని ప్రయత్నిస్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండటమే కాదు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి మోసాలను నివారించాలి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా సైబర్ క్రైమ్స్ పై మీ అందరికీ అవగాహన కల్పిస్తూనే ఉంటా. అని పేర్కొంది.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ అంబాసిడర్ గా ఎంపికైన రశ్మిక మందన్నకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.