ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా కె.వి.ఎన్‌. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై చివ‌రి చిత్రం ద‌ళ‌ప‌తి 69

ఇండియన్ సినీ పరిశ్రమలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నుంచి భారీ ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. ఈ చిత్రం విజయ్ హీరోగా రూపొందుతున్న చివరి సినిమా. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విజయ్, దళపతి విజయ్ గా పేరుగాంచి, అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సాధించారు. ఆయన హీరోగా నటిస్తున్న దళపతి 69 సినిమా 2025 అక్టోబర్ నెలలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

దర్శకుడు హెచ్. వినోద్ మరోసారి అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు తన సంగీతంతో ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వనున్నారు. జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు, ఎన్.కే. నారాయణ సమర్పణలో ఈ చిత్రం రూపొందించబడుతుంది.

దళపతి విజయ్ అభిమానులకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం దళపతి విజయ్ కెరీర్‌లో కొత్త రికార్డులను సృష్టించనుంది. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ విడుదల చేసిన వీడియోలో అభిమానులు విజయ్ పట్ల చూపిస్తున్న ప్రేమను స్పష్టంగా చూడవచ్చు.

“దళపతి విజయ్‌తో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, 2025 అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను అభిమానులు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం,” అని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.