పంజా వైష్ణవ్ తేజ్ ల ‘ఆదికేశవ’ నుంచి జి.వి.ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ప్రేమ గీతం ‘హే బుజ్జి బంగారం’ విడుదల

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల కలిసి తొలిసారిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్. తక్కువ సమయంలోనే వైవిధ్యమైన జోనర్‌లతో తనదైన ముద్ర వేసిన పంజా వైష్ణవ్ తేజ్‌ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటం విశేషం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా విభిన్న చిత్రాలతో అలరిస్తోంది. ఇటీవల ‘మ్యాడ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న సితార.. దీపావళికి ఆదికేశవతో ఆ విజయపరంపరను కొనసాగించాలని చూస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదికేశవ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘సిత్తరాల సిత్రావతి’ అనే పాట విడుదలైంది. విడుదల కాగానే ఈ పాట వైరల్‌గా మారింది. ఈ పాట సంగీతం, సాహిత్యం శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని ప్రశంసలు కురిపించాయి.

ఆ పాటలోని శ్రీలీల, పంజా వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్‌లు కూడా వైరల్‌గా మారి ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఇప్పుడు, ఆదికేశవ చిత్రం బృందం “హే బుజ్జి బంగారం” అనే మెలోడీని విడుదల చేసింది.

ఈ పాట అబ్బాయి ప్రేమను తెలుపుతూ సాగింది. ముఖ్యంగా అద్భుతమైన సాహిత్యం ఈ సంవత్సరం ప్రతి రొమాంటిక్ ప్లేలిస్టులో ఈ పాటను భాగం చేసేలా ఉంది. జి.వి.ప్రకాష్ సంగీతం ఈ రొమాంటిక్ పాటకి ఓ కొత్త అనుభూతిని జోడించింది. ఈ పాటకు సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఎంతో అర్థవంతమైన, అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా.. అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఎంతో అందంగా ఆలపించారు.

ఆదికేశవ టీమ్ ఈ చిత్ర విజయం పట్ల చాలా నమ్మకంగా ఉంది. పాటలు, టీజర్‌ల ద్వారా ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలు, ఆసక్తి ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందిస్తాయని చిత్ర బృందం ఆశిస్తోంది.

జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆదికేశవ చిత్రం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.