‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రంపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం, నేడు(మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే విశేష స్పందన లభిస్తోంది. మొదటి భాగానికి రెట్టింపు వినోదం ‘మ్యాడ్ స్క్వేర్’లో ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ ఆనందాన్ని పంచుకుంది.

 

చిత్ర సమర్పకులు సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “మా మ్యాడ్ స్క్వేర్ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఉదయం 8 గంటల షోతో మొదలై, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో మ్యాడ్ క్లోజింగ్ కలెక్షన్స్, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ కి వచ్చే అవకాశముంది. మేము ముందు నుంచి చెబుతున్నట్టు, ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాని రూపొందించాము. ఆ విషయంలో విజయం సాధించాము. ఈ వేసవిలో ప్రేక్షకులు మా సినిమా చూసి బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాము. కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది.” అన్నారు.

 

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ముందుగా కృతఙ్ఞతలు. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి వస్తున్నారు. సినిమా చూస్తూ అందరూ నవ్వుతూనే ఉన్నారు. అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నిర్మాతగా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు అందించాలని ఉంది.” అన్నారు.

 

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “సీక్వెల్ కదా మొదటి భాగంతో పోలుస్తారనే టెన్షన్ తోనే థియేటర్ కి వెళ్ళాము. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే, దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే ఫీలింగ్ వచ్చింది. సంగీత దర్శకులు భీమ్స్ గారికి, థమన్ గారికి ధన్యవాదాలు. ఎడిటర్ నవీన్ నూలి క్రిస్పీ రన్ టైంతో సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచారు. మేము సర్ ప్రైజ్ లా దాచిన సునీల్ గారి పాత్రకి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. అందరూ థియేటర్ కి వెళ్ళి, సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

 

కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తోంది. థియేటర్ లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే, మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.” అన్నారు.

 

కథానాయకుడు రామ్ నితిన్‌ మాట్లాడుతూ, “ప్రేక్షకులు మ్యాడ్ ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ ని చూసి కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే నవ్వుతున్నారు. మాకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది. నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని, ఇప్పుడే తెలిసింది. మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

 

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు, నిర్మాత నాగవంశీ గారు ముందే చెప్పారు.. నవ్వించడానికి ఈ సినిమా తీశామని. ప్రేక్షకులు అదే అంచనాలతో థియేటర్ కి వచ్చి, సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాము.” అన్నారు.

 

నటి ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ, “థియేటర్ లో నా పాత్రకి ఈ స్థాయి స్పందన లభిస్తుందని అసలు ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.” అన్నారు.