వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపారు హీరోయిన్స్ ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్.
హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాను. అందులో ఒకటి విజయవాడకు చెందిన ఓ చిన్న టౌన్ అమ్మాయి. తను చాలా అమాయకురాలు. సిటీ లైఫ్ ఆమెకు తెలియదు. అలాంటి అమ్మాయి ఒక పేరున్న డాక్టర్ ను పెళ్లి చేసుకుంటుంది. మరొక క్యారెక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉండే సిటీ అమ్మాయి. ఆమె మాయా ఫెర్నాండేజ్. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం. మన రియల్ లైఫ్ లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్ ను ఎవరూ తెరకెక్కించలేదు. ఒక యాక్సిడెంట్ లో అయేషా క్యారెక్టర్ గాయపడితే, నా ముఖాన్ని ఆమెకు రీప్లేస్ చేశారు. ఇక ఆ క్యారెక్టర్ ప్లే చేయాల్సి వచ్చినప్పుడు నేను ఆమె ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసి నటించేదాన్ని. అయేషా కెమెరా ముందు కాకుండా బయట ఎలా వ్యవహరిస్తుందో చూసి పరిశీలించాను. మేము మా విజన్ కంటే దర్శకుడు సందీప్ ఎలా మమ్మల్ని తెరపై చూపించాలనుకుంటున్నాడు అనే విజన్ ను నమ్మాము. దాన్నే ఫాలో అయ్యాము. సందీప్ ఒక కొత్త తరహా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తప్పకుండా ఆదరిస్తాని కోరుకుంటున్నాను. నా కెరీర్ విషయానికొస్తే హుషారు తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాను. నటిగా పేరు తెచ్చే సినిమాలు చేయాలనే ప్రయత్నంలో ఉండగా..ముఖచిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నా పర్మార్మెన్స్ కు పేరొస్తుందని ఆశిస్తున్నాను. నన్ను హీరోయిన్ గా మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమవుతుందని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ అయేషా ఖాన్ మాట్లాడుతూ…ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్ లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్ గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయి తను. దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేస్తుంటుంది. అన్ కాంప్రమైజ్డ్ గర్ల్ అనుకోవచ్చు. నాకు తెలుగులో తొలి సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ చిత్రం నా డెబ్యూ మూవీగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో నటించేప్పుడు నాకు ఎదురైన ఛాలెంజ్ భాష. తెలుగు తెలియదు కాబట్టి డైలాగ్స్ నేర్చుకోవడం, చెప్పడం కష్టంగా అనిపించేది. ఈ సినిమాలో యాక్సిడెంట్ సీన్స్ చేసేప్పుడు కష్టపడ్డాను. నాకూ గాయాలయ్యాయి. రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ వల్ల పెయిన్స్ వస్తుంటాయి. ఏమైనా కష్టపడితే గానీ లైఫ్ లో ఏదీ దక్కదు అన్నట్లు ఈ సినిమాకు గాయపడినా మంచి చిత్రంలో భాగమవడం సంతృప్తిగా ఉంది. ప్రియాతో కలిసి కొన్ని సీన్స్ చేశాను. అన్నారు.